సాగు సక్సెస్‌

Andhra Jyothy October 9th, 2020 07:15
 విస్తారంగా వర్షాలు
 రైతన్నకు సిరులు కురిపించనున్న వానాకాలం పంటలు
 రూ.1500 కోట్ల ఆదాయం అంచనా
 60 లక్షల క్వింటాళ్ల వరి, 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): ఈ వానాకాలం జిల్లా రైతులకు సిరులు కురిపించనుంది. విస్తారంగా వర్షాలు కురువడంతో రైతులు అంచనాకు మించి 50 వేల ఎకరాల్లో అధికంగా పంటలు సాగు చేశారు. సుమారు 1500 కోట్ల రూపాయల విలువచేసే పంట దిగుబడులు రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. వరప్రదాయిని శ్రీరాంసాగర్‌, తలాపున ఉన్న రాజరాజేశ్వర(మిడ్‌ మానేరు) రిజర్వాయర్‌, తలాపున ఉన్న ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ నిండి ఆయకట్టు రైతులకు అండగా నిలిచాయి. వానాకాలం కరీంనగర్‌ జిల్లా రైతులు 3,42,158 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. 2,51,000 ఎకరాల్లో వరి, 74,158 ఎకరాల్లో పత్తి, 5,794 ఎకరాల్లో కంది, 4,252 ఎకరాల్లో మొక్కజొన్న, 1,212 ఎకరాల్లో పెసర, 266 ఎకరాల్లో వేరుశెనగ, 5,476 ఎకరాల్లో జొన్న, మినుము, స్వీట్‌కార్న్‌, పొగాకు, ఆముదం, ఆవాలు, కొర్రలు, అనుములు, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేశారు.


సగటున ఎకరాకు వరి దొడ్డురకం 24 నుంచి 26 క్వింటాళ్ల వరకు, సన్నరకం 22 నుంచి 24 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పత్తి ఎకరాకు ఆరున్నర క్వింటాళ్ల చొప్పున, మొక్కజొన్న ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున, కంది ఎకరాకు ఏడు క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎకరాకు 3 క్వింటాళ్ల చొప్పున పెసర ఇప్పటికే రైతుల చేతికి వచ్చింది.


సకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఈ అంచనాల మేరకు జిల్లాలో 1130 కోట్ల రూపాయల విలువచేసే 60 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం, 275 కోట్ల రూపాయల విలువ చేసే 5 లక్షల క్వింటాళ్ల పత్తి, 24.33 కోట్ల రూపాయల విలువ చేసే 40,558 క్వింటాళ్ల కంది, 15.74 కోట్ల విలువచేసే 85,000 క్వింటాళ్ల మొక్కజొన్న, 2.61 కోట్ల విలువచేసే 3,636 క్వింటాళ్ల పెసర, తదితర పంటల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

 
ప్రారంభమైన వరికోతలు

వరి కోతలు ప్రారంభమై మార్కెట్‌కు ధాన్యం తెచ్చేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15 నుంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కోవిడ్‌ కారణంగా గత యాసంగిలో అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పడు గతంలో మాదిరిగానే అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా సంఘాలు, డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రాలతోపాటు మార్కెట్‌ యార్డుల్లో కూడా ఈసారి వరిధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.


వరిధాన్యానికి సాధారణ రకం 1,868 రూపాయలు, ఏ గ్రేడ్‌ రకానికి 1,888 రూపాయలు మద్ధతు ధర నిర్ణయించారు.  పత్తి మధ్యరకం పింజ ఉన్న దానికి క్వింటాలుకు 5,515 రూపాయలు, పొడుగు పింజ రకానికి 5,528 రూపాయలు మద్ధతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కంది  క్వింటాలుకు 6 వేల రూపాయలు, మొక్కజొన్న 1,850 రూపాయలు, పెసర పంటకు 7,196 రూపాయలు మద్ధతు ధరగా కేంద్రం ప్రకటించింది. వర్షాకాలంలో ఆశించిన దిగుబడులు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Disclaimer: The views, thoughts and opinions expressed in the article belong solely to the author and not to RozBuzz.

rozbuzz Powered by RozBuzz
view source

Hot Comments

Recent Comments