వైవీ సుబ్బారెడ్డి కోసం ప్రత్యేక జీవో తెచ్చిన జగన్

Andhra Jyothy October 9th, 2020 10:50

అమరావతి: ప్రపంచంలోనే హిందువుల అతిపెద్ద ధార్మిక క్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం విరాజిల్లుతోంది. టీటీడీ పాలకమండలిలో చోటు దక్కడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తారు. అందుకే టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యత్వం ఇప్పించడానికి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. దేశవ్యాప్తంగా నేతలు సిఫార్సు చేస్తారు. ఇక నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంపై ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా పడింది. అది ఎంతలా అంటే.. గతంలో 18 మంది ఉన్న టీటీడీ పాలకమండలి సంఖ్యను రెట్టింపు చేసేంతగా పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 36 మందితో జంబో జెట్ పాలకమండలిని జగన్ సర్కారు ఏర్పాటు చేసింది. అయితే ఏ నిమిషంలో వీరికి పాలకమండలిలో చోటుదక్కిందో కానీ.. ఆ పదవిలో పూర్తిస్థాయిలో స్వామిసేవ చేసుకునే భాగ్యంతోపాటు తమ అనుయాయులకు దర్శనాలు కల్పించే అవకాశం మాత్రం లభించడం లేదు.

జగన్ సర్కారు ఏర్పాటు చేసిన జంబో జెట్ పాలకమండలిలోని సభ్యులకు మొదటి నుంచి కూడా అవాంతరాలే ఎదురవుతున్నాయి. టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి జూన్ 21న ప్రమాణస్వీకారం చేశారు. నిబంధనల మేరకు పాలకమండలి అధికారిక కాలపరిమితి అప్పటినుంచి ప్రారంభమైనట్టే. ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్‌ను నియమించినప్పుడే సభ్యులను నియమించలేదు. దేశవ్యాప్తంగా పాలకమండలిలో సభ్యత్వం కోసం వచ్చిన ఒత్తిడిల నేపథ్యంలో పాలకమండలి సభ్యుల నియామకంలో జగన్ ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఛైర్మన్‌ను నియమించిన మూడు నెలలకు సభ్యులను నియమించింది. దీంతో సెప్టెంబరు 23వ తేదీన టీటీడీ పాలకమండలి పూర్తిస్థాయిలో కొలువుదీరింది. అప్పటికే వీరి పదవీకాలం మూడు నెలలు శ్రీవారికి సమర్పయామి అన్నట్టుగా అయిపోయింది.

టీటీడీ పాలకమండలి సభ్యులు ప్రధానంగా ప్రతినెలా జరిగే సమావేశానికి హాజరవుతారు. అధికారులు తయారుచేసిన ఎజెండాలోని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. స్వామివారిని దర్శించుకోవడం, తమవారికి సిఫార్సులపై దర్శనభాగ్యం కల్పిస్తారు. గతంలో 18 మంది ఉండే పాలకమండలి స్థానంలో 36 మంది రావడంతో.. వీరి సిఫార్సులపై కల్పించే దర్శన కోటాకి కూడా కోత పడింది. ఇక ఉన్నదాంతో సర్దుకుపోదాంలే అనుకున్న వీరికి.. కరోనా మరింతగా దెబ్బకొట్టింది. కరోనా కారణంగా శ్రీవారి ఆలయంలో 80 రోజులపాటు అసలు దర్శనాలే లేవు. అటు తర్వాత ప్రారంభించినా.. అది పరిమిత సంఖ్యలోనే కావడంతో.. వీరికి దర్శన కోటాపై ఊచకోత పడింది. గతంలో ప్రతినిత్యం 30 టిక్కెట్లను కేటాయిస్తుండగా ప్రస్తుతం వారానికి 18 మందికి మాత్రమే బ్రేక్ దర్శనానికి సిఫార్సు చేసే స్థితికి వీరి కోటా పడిపోయింది. ఇలా ఇప్పటికే ఏడు నెలలు కాలం కరోనా దెబ్బకి కర్పూరంలా కరిగిపోయింది.

సాధారణంగా టీటీడీ పాలకమండలి కాలపరిమితి రెండేళ్లు. అయితే ఛైర్మన్‌గా సీఎం బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డిని నియమించడంతో.. కాలపరిమితి లేకుండానే ఛైర్మన్ నియామక జీవోను ప్రభుత్వం జారీ చేసింది. మూడు నెలల తర్వాత పాలకమండలి సభ్యులను నియమించినా.. అందులోనూ  కాలపరిమితి లేకుండానే జీవో జారీ చేసింది. అయితే పాలకమండలిలో సభ్యత్వం కోసం దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖుల నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఛైర్మన్ మాట ఎలావున్నా.. సభ్యులను మాత్రం రెండేళ్లు మాత్రమే కొనసాగిస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుత పాలకమండలిలో తిరిగి ఎవరైనా కొనసాగించాలని సీఎంపై ఒత్తిడి తెస్తే ఇప్పుడున్న వారిలో నలుగురైదుగురిని కొనసాగించి మిగతా స్థానాల్లో కొత్తవారిని నియమించే అవకాశం ఉందట.

ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఉన్నది మరో 9 నెలలు మాత్రమే. కరోనా ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి. కరోనాకి వ్యాక్సిన్ వచ్చే వరకు సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం లేదు. వచ్చే ఏడాది జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందనీ, ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన చేసేశారు. దీంతో వ్యాక్సిన్ వచ్చినా.. అది అందరికీ అందుబాటులో వచ్చేసరికి.. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం మాత్రం పూర్తి అయిపోతుంది. ఇలా కరోనా కాటుకి గురైన పాలకమండలిపై ప్రభుత్వం కనికరిస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి మరో ఏడాది పదవీకాలాన్ని పొడిగిస్తుందో.. లేదో.. చూడాలి.

Disclaimer: The views, thoughts and opinions expressed in the article belong solely to the author and not to RozBuzz.

rozbuzz Powered by RozBuzz
view source

Hot Comments

Recent Comments